గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (16:42 IST)

ఏపీలో ఇక ప్రతి శుక్రవారం జాబ్ మేళా - జాబ్ క్యాలెండర్ రిలీజ్

apssdc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. 
 
స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్టు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) తెలిపింది. ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక్క జాబ్ మేళాను నిర్వహిస్తామని ఏపీఎస్ఎస్‌డీసీ అధికారులు వెల్లడించారు. 
 
ఈ మేరకు గురువారం ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ, సీఈవో సత్యనారాయణ, సలహాదారు చల్లా మధుసూదన రెడ్డి, ఛైర్మన్ అజయ్ రెడ్డితో కలిసి ఆయన జాబ్ మేళా క్యాలెండర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ సంస్థ ద్వారా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్ డే నిర్వహించనన్నట్టు తెలిపారు. నిరుద్యోగులకు రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చకున్నట్టు తెలిపారు. 
 
గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చామని ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం పరిధిలో స్కిల్ హబ్స్ ప్రాంభిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు ఆయన తెలిపారు.