సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (20:07 IST)

జనసేన పార్టీతో పొత్తు లేనట్టే : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలు

madhav
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండటం కష్టమేనని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను సాయం కోరగా ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో చాలా సుధీర్ఘంగా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. 
 
బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలని అనుకుంటుందని తెలిపారు. ఏపీలో బీజేపీ నేతల్లో కీలంగా ఉన్న మాధవ్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. అంతేకాదు, మాధవ్ వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు బ్రేకప్ చెప్పేసుకున్నట్టేనన్న చర్చ మొదలైంది. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా ఓడిపోయారు. ఈ ఫలితాలపై బీజేపీ నేతలు మంగళవారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పని చేయలేదన్నారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా, ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు బంధం తెంచుకుంటే భారతీయ జనతా పార్టీ అధికార వైకాపాతో కలిసి పోటీ చేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే కోణంలో రాజకీయ నేతలు సైతం తమ విశ్లేషణలు సాగిస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు బీజేపీ కేంద్ర నాయకులతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి సత్ సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే చర్చ సాగుతోంది.