బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఓవరాక్షన్-క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి (video)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత కుమారుడు, యువ ఎమ్మెల్యే వీరంగం సృష్టించాడు. స్థానిక మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాటుతో చావబాదాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్-3 నియోజకవర్గం నుంచి ఆకాశ్ విజయవర్గియా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గియా కుమారుడు. అయితే, ఆకాశ్ విజయవర్గియా తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుధవారం ఇండోర్‌లో స్థానిక నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా అక్రమ కట్టడాలను కూల్చివేతకు వచ్చిన అధికారులపై ఆకాష్ విజయవర్గియా తన అనుచరులతో కలిసి క్రికెట్ బ్యాటుతో దాడికి దిగారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఒక్క అధికారిపై ఆకాష్‌తో పాటు.. అతని అనుచరులంతా కలిసి చావబాదారు. ఆ సమయంలో పోలీసులు అంత వారించినా వారు వినిపించుకోలేదు. పైగా, పోలీసులను సైతం తోసుకుంటూ మున్సిపల్ అధికారిపై దాడికి దిగారు. దీనిపై ఆకాశ్ స్పందిస్తూ, అక్రమ నిర్మాణాల కూల్చివేసేందుకు వచ్చన అధికారులకు పది నిమిషాల్లో ఇక్కడ నుంచి వదిలి వెళ్లాలని చెప్పాను. కానీ వారు పట్టించుకోలేదు.
పైగా, తాను ప్రజలతో ఎన్నికైన ప్రతినిధిని. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానికులు, అధికారులతో మాట్లాడుతున్నాను. కానీ, సివిక్ బాడీ అధికారులు మాత్రం దాదాగిరి చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు సహించలేక పోయారనీ, అందుకే ఈ సంఘటన జరిగినట్టు చెప్పుకొచ్చారు.