1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (11:34 IST)

వైఎస్ వివేకా హత్య కేసు : ప్రధాన నిందితుడు ఆయనేనా???

మాజీ ఎంపీ, మాజీ మంత్రి, వైకాపా నేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంతబాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలోభాగంగా, సీబీఐ విచార‌ణ‌కు శుక్రవారం ఆరుగురు అనుమానితులు హాజ‌ర‌య్యారు. వివేకానంద రెడ్డ‌ి ప్ర‌ధాన అనుచ‌రుడు ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.
 
అలాగే, పులివెందుల‌కు చెందిన చిన్న‌ప్ప‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి, క‌డ‌ప‌లోని మోహ‌న్ ఆసుప‌త్రి య‌జ‌మాని ల‌క్ష్మీరెడ్డి, పులివెందుల‌కు చెందిన కాఫీ పొడి వ్యాపారి సుగుణాక‌ర్‌, సింహాద్రి పురం మండ‌లం సుంకేశుల‌కు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 
 
వీరిలో జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి వ‌రుస‌గా మూడో రోజు విచార‌ణ‌కు హాజ‌రుకావడం గమనార్హం. గ‌తంలో వివేకాకు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి పీఏగా ప‌నిచేశాడు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచార‌ణ కొన‌సాగుతోంది. 
 
కాగా, ఇప్ప‌టికే వివేక హ‌త్య కేసులో అనుమానితులుగా ఉన్న ప‌లువురిని అధికారులు ప్ర‌శ్నించి ప‌లు వివ‌రాలు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. కాగా, వివేకా హత్య గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది. అపుడు ఈ కేసులోని నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం.