కుప్పంకు చంద్రబాబు, అదేనా ప్లాన్..?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. రెండుసార్లు వాయిదాపడ్డ బాబు కుప్పం పర్యటన మూడవసారి ఖచ్చితంగా జరుగుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు.
అయితే బద్వేలు ఎన్నికల రోజే చంద్రబాబు తన పర్యటనను పెట్టుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో విధ్వంసకరమైన వాతావరణ ఏర్పడటం.. అందులోను టిడిపి కార్యాలయాలపైనా, కార్యకర్తలపైన దాడుల తరువాత ఒక్కసారిగా ఎపి వేడెక్కింది. దీంతో చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు.
బద్వేలు ఉప ఎన్నికల్లో టిడిపి తరపున అభ్యర్థి పోటీ చేయకపోయినా 30వ తేదీ ఉప ఎన్నికలు ఉంటే చంద్రబాబు ఆరోజు తన పర్యటనను ఫిక్స్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు అందరూ బద్వేలు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటూ ఉంటారు.
అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పర్యటన ఎందుకన్నది నేతల ప్రశ్న. దాంతో పాటు కుప్పం నియోజకవర్గంలో ఈ మధ్య కొంతమంది వైసిపి నేతలు చంద్రబాబు పర్యటన ఉంటే కారు కింద బాంబు పెట్టి పేల్చేస్తామన్నారు. ఇది కాస్త టిడిపి నేతల్లో ఆగ్రహానికి తెప్పిస్తోంది.
కార్యాలయానికి వెళ్ళి దాడులు చేసిన వారు చంద్రబాబుపై ఎందుకు దాడి చేయరన్నది టిడిపి నేతల ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కుప్పం పర్యటన సరైంది కాదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.
అధినేతనే అడ్డుకుని దాడికి పాల్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కార్యకర్తల్లో మెదులుతున్న ప్రశ్న. అంతా సద్దుమణిగిన తరువాత పర్యటనకు వస్తే బాగుంటుందన్నది కార్యకర్తల అభిప్రాయం.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎలాగో రాలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు హడావిడిగా అధినేత పర్యటించాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయంలో నేతలు ఉన్నారట. అంతేకాదు కుప్పం టిడిపికి కంచుకోట కాబట్టి ప్రజలు ఖచ్చితంగా టిడిపినే గెలిపిస్తారన్నది వారి ఆలోచన.
నేతలను ఒక తాటిపై తీసుకువచ్చి మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అనవసరంగా పర్యటనలు పెట్టుకోవడం నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఇదంతా ఒక ఎత్తయితే వైసిపి కార్యకర్తలు తనపై దాడికి పాల్పడితే దాన్నే సింపతిగా చూపిస్తూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి జెండాను ఎగురవేయాలన్నది చంద్రబాబు ఆలోచనట. మరి చూడాలి అది ఎంతవరకు జరుగుతుందనేది.