1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (08:33 IST)

విశాఖ, విజయవాడలలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

కరోనా, లాక్‌డౌన్‌తో విశాఖపట్నం, విజయవాడలలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు శనివారం ఉదయం నుంచి రోడ్డెక్కాయి. విశాఖపట్నం, విజయవాడ మహా నగరాల్లో సిటీ బస్సుల పున:ప్రారంభానికి ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.

విద్యా, ఉద్యోగ పరీక్షల్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ అనుమతి మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనల్ని పాటిస్తూ సిటీ బస్సులను నడుపుతున్నారు. ఆ దిశగా సిటీ సర్వీసుల్లో ప్రయాణించే వారికీ శానిటైజర్‌, మాస్క్‌ తదితర జాగ్రత్తల్ని పాటించేలా ఆర్టీసీ యంత్రాంగం అవగాహన చర్యలకు ఉపక్రమించింది.

రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ నగరాల్లో దాదాపు ఆర్నెళ్ల నుంచి సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావంతో సాధారణ బస్సులతోపాటు సిటీ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

లాక్‌డౌన్‌కు ముందు విజయవాడ, విశాఖపట్నం మహానగరాల్లో దాదాపు 1,100 సిటీ బస్సులుండగా, వాటి ద్వారా రోజుకు దాదాపు రూ.11 కోట్ల వరకూ ఆదాయం వచ్చేదని అధికారులు అంచనా. సిటీ సర్వీసులు డిపోల్లోనే నిలిచిపోవడంతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం విదితమే.

ఇప్పుడు బస్సులను పునరుద్ధిరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఈడీ ఆపరేషన్స్‌ బ్రహ్మానందరెడ్డి పర్యవేక్షణలో సిటీ బస్సుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలోని పలు డిపోల్లో ఉన్న బస్సులను వాటర్‌తో శుభ్రం చేస్తున్నారు.

ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లను అందుబాటులోకి వచ్చేలా ఆదేశాలు జారీజేశారు. ఒక్కసారిగా సిటీ బస్సులు రోడ్డెక్కడంతో ఈ రెండు నగరాల్లో రూట్ల వారీగా బస్సుల పునరుద్ధరణ చర్యలకు డిపో మేనేజర్లు నిమగమయ్యారు. మంగళగిరి, విద్యా ధరపురం మైలవరం,ఆగిరిపల్లి తో పాటు  దాదాపు 500 బస్సులు ప్రధాన మార్గాల్లో బస్సులు నడుస్తున్నాయి.