విజయవాడలో భారీగా హవాలా నగదు పట్టివేత
విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి. కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ, గొల్లపూడి, వై-జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఏపీ 37 బి డబ్ల్యూ 4532 నెంబరు గల షిఫ్ట్ కారులో ప్రత్యేకంగా సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సులలో హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.1 కోటి 47 లక్షల విలువ గల నగదు, 34 వేల ఆమెరికన్ డాలర్లు మరియు ఒక షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబులు ఇద్దరు అన్నదమ్ములు వీరిద్దరు గత కొంత కాలంగా నరసాపురంలో గల దేవి జ్యూయలరీ మార్ట్ నందు పని చేయుచుండగా సదరు షాపు యజమాని అయిన ప్రవీణ్ కుమార్ జైన్ తన వద్ద పని చేస్తున్న పై ఇద్దరు నిందితులకు మొత్తం కలిపి రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లను తీసుకుని హైదరాబాద్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ జైన్ సోదరుడు అయిన కీర్తికి ఇచ్చిరమ్మని పంపాడు.
దానిని తరలిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని అక్రమ మార్గంలో రవాణా చేయబడుతున్న కావాలి నగదు సుమారు రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు నిమిత్తం భవానీపురం పోలీసు వారికి నిందితులను అప్పగించడం జరిగింది.
ఇంకంట్యాక్స్ అధికారులకు, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇ డి) వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హవాలా నగదును తరలిస్తున్న నలుగురు నిందితులైన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాద్, ప్రవీణ్ కుమార్ జైన్లను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అభినందించారు.