గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (19:06 IST)

వరద ప్రాంతాల్లో జేసీబీపై నాలుగు గంటల పాటు సీఎం చంద్రబాబు (Video)

babu on jnc vehicle
విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యటిస్తున్నారు. ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో జేసీబీ ఎక్కి నాలుగు గంటలుగా వరద ప్రభావిత కాలనీలను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఆయన బాధితులను పరామర్శిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 
 
ఆహారం అందుతుందా లేదా అని బాధితులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో చివర ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై చంద్రబాబు ఆరా తీశారు. జేసీబీపై చంద్రబాబు పర్యటిస్తుండటంతో సీఎం కాన్వాయ్‌ వివిధ ప్రాంతాల్లో తిరుగుతోంది. 
 
మరోవైపు, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై సోమవారం అర్థరాత్రి 11.30 గంటలకు ఆయన ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివర ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ముంపు ప్రాంతాల ప్రారంభంలోనే ఆహార పొట్లాలను బాధితులు తీసుకుంటుండటంతో... అవి చివరి వరకు చేరలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఏడాది వయసున్న బాబును పట్టుకుని బయటకు వచ్చాడని... సార్, బాబు ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లో భార్యను వదిలేసి బయటకు వచ్చానని చెప్పాడని... తన భార్య ఫలానా చోట ఉందని, ఆమె ప్రాణాలు మీరే కాపాడాలంటూ వేడుకోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని సీఎం తెలిపారు. 
 
ఒకచోట వృద్ధ దంపతులు వరద నీటిలో తడిసిపోయి, నిస్సహాయ స్థితిలో కనిపించారని... వారి స్థితి తనను కలచివేసిందని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని... ఈ కష్టకాలంలో విధినిర్వహణలో అధికారులు అలసత్వం వహించవద్దని ఆయన హెచ్చరించారు. రాబోయే మూడు రోజులు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. వరద తగ్గాక పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, పునరావాసం కల్పించాలని అన్నారు.