శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (22:35 IST)

కరోనా వైరస్ ఎఫెక్ట్, మూగబోయిన మీ సేవా కేంద్రాలు

ఏపీలో కరోనా వైరస్ కారణంగా మీ సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలన్నా మీ సేవను ఆశ్రయిస్తాం. నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఒకే దగ్గర అన్ని రకాల సేవలను పొందే వెలుసుబాటు ఈ సేవా కేంద్రాలలో ఉన్నాయి.
 
అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా జనం లేక ఈ సేవా కేంద్రాలు బోసిపోతున్నాయి. కోవిడ్ పుణ్యమా అని అన్ని రంగాలు మూతబడ్డాయి. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ఈ సేవా కేంద్రాలు ఇప్పుడు మౌనం దాలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమయానికి క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం కుస్తీ పడుతుంటారు. కానీ ఇప్పటి వరకు విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఎవరూ కనిపించడం లేదు.
 
మీ సేవల నుంచి 270 పైగా కార్యక్రమాలు అందిస్తున్నారు. కరోనాకు ముందు రోజుల్లో రోజుకి కనీసం 300 మంది వచ్చేవారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా 20 మంది కూడా రావడం లేదు. ప్రస్తుతం తమ దగ్గర విధులు నిర్వహించే వాళ్లకు, విద్యుత్ చార్జీలకు, ఇంటర్నెట్ బిల్లులకు తీవ్ర భారంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు.