బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (15:24 IST)

తిరుపతిలో కరోనా వైరస్ కలకలం... వణికిపోతున్న ప్రజలు... భక్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. కోరోనా సోకినట్టుగా భావిస్తున్న ఓ అనుమానితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ అనుమానితుడు పేరు చెన్ షి షున్. వయసు 35 యేళ్లు. తైవాన్‌ వాసి. రుయాలోని ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
కాగా, ఈ నెల 17వ తేదీన అతడు తైవాన్‌ నుంచి పలు యంత్రాలను అమరరాజ గ్రూప్స్‌కు తీసుకు వచ్చి, వాటిని అమర్చే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి రెండు రోజులుగా జలుబు, దగ్గరు తీవ్రతరం అయ్యాయి. వాటిని కోవిడ్‌ లక్షణాలుగా భావించిన శనివారం రుయాకు తీసుకొచ్చారు. 
 
ప్రస్తుతానికి అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా... రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పుణెకు పంపాలని వైద్యులు భావిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చేవరకూ అతడిని జిల్లా వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో ఉంచాలని భావిస్తున్నట్లు రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీ రమణయ్య, జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ తెలిపారు. 
 
కాగా కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి రుయాలో చేరినట్లు వార్తలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.... తైవాన్‌ వ్యక్తి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ విషయంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా నుంచి రాకపోకలు ఆపేసి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం.. ఇరాన్ పౌరులకు భారత్‌ వీసాలు నిలిపివేశారు. చైనాతోపాటు దక్షిణ కొరియా, పాకిస్థాన్, ఇరాన్ దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవగా.. కరోనా వైరస్ బారినపడిన దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉన్న విషయం తెల్సిందే.
 
చైనాలోని వుహాన్ ప్రావిన్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో సోకి నిద్ర లేకుండా చేస్తున్న ఈ కోవిడ్19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 89 వేల మందికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. పైగా, కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాలు వణికిపోతుండగా.. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది.
 
తిరుమలలో కనిపించని భక్తుల రద్దీ.. 
ఇదిలావుండగా, తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు. వారాంతం ముగియడం, పరీక్షల సీజన్‌కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో పాటు కరోనా వైరస్ వదంతుల నేపథ్యంలో తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. సోమవారం ఉదయం స్వామివారి సర్వదర్శనానికి కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంటులో భక్తులు వేచివున్నారు. 
 
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి చూస్తున్న సాధారణ భక్తుల సంఖ్యతో పోలిస్తే, రూ.300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, దివ్య దర్శనం భక్తుల సంఖ్యే అధికంగా ఉంది. స్వామి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, ఆదివారం స్వామివారిని 83 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా సుమారు రూ.3 కోట్ల ఆదాయం లభించింది.