సులభంగా శ్రీవారి దర్సనం..కానీ...?
లాక్‌డౌన్ ప్రకటించకముందే తిరుమల నిర్మానుష్యంగా మారిపోయింది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. దీంతో తిరుమల శ్రీవారి దర్సనార్థం విచ్చేసే భక్తులకు సులభతరంగా స్వామివారి దర్సనభాగ్యం లభిస్తోంది.
ఎప్పుడు భక్తులతో సందడిగా ఉండే తిరుమల ఇప్పుడు నిశ్శబ్ధంగా మారింది. .కోవిడ్ తీవ్రత ను దృష్టిలో ఉంచుకుని టిటిడి దర్సన టిక్కెట్ల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఏఫ్రిల్ 14వతేదీ నుంచి సర్వటోకెన్ల భక్తులకు టోకెన్ల జారీని నిలిపివేసింది. అప్పటికే ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్సనానికి సంబంధించి ప్రత్యినిత్యం 26 వేల టికెట్లను జారీ చేసిన టిటిడి వారిని మాత్రమే దర్సనానికి అనుమతిస్తామని ప్రకటించింది.
వీరితో పాటు సిఫార్సు లేఖపై కేటాయించే విఐపి దర్సనాలను కేటాయించే భక్తులను సేవాటిక్కెట్లను కలిగిన భక్తులను అనుమతించడంతో ప్రతినిత్యం కూడా 30 వేలమంది భక్తులకు స్వామివారి దర్సనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ఇక మే నెలలో అయితే ఈ సంఖ్యను మరింత తగ్గించింది టిటిడి.
ఆన్ లైన్ లో 15 వేల టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తుండడం, ఇప్పటికే మహారాష్ట్రలో లాక్ డౌన్ ప్రకటించి ఉండడం..తమిళనాడు నుంచి కూడా ఇపాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తూ ఉండడం.. మరోవైపు ఎపి, తెలంగాణాలో కూడా కరోనా ఉదృతి తీవ్రంగా ఉండడంతో శ్రీవారి దర్సనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది.
ఆలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నామని.. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు ప్రస్తుతం తిరుమల పర్యటనకు రావద్దని విజ్ఙప్తి చేశారు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి. భక్తులను నిర్భందంగా దర్సనానికి నిలిపివేసే యోచన టిటిడికి లేదన్న ఛైర్మన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్సకాలను అనుసరించి నిర్ణయాలను తీసుకుంటామన్నారు.
అయితే ఏఫ్రిల్ మాసంలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం బాగా తగ్గినట్లు టిటిడి చెబుతోంది. ఏఫ్రిల్ నెలలో శ్రీవారిని 9.05 లక్షలమంది దర్సించుకోగా హుండీ ఆదాయం 62 కోట్ల 62 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. అలాగే తలనీలాలన 4.61 లక్షలమంది భక్తులు సమర్పించారు.
అదే మార్చి నెలలో శ్రీవారినికి 16.27 లక్షలమంది భక్తులు దర్సించుకుంటే హుండీ ఆదాయం 104 కోట్ల రూపాయలు వచ్చింది. ఒకే ఒక్క నెలలో కరోనా కేసులు పెరగడంతో భక్తుల సంఖ్య తగ్గడంతో పాటు ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకున్నా తిరుమలకు మాత్రం భక్తులు రావడం లేదు. దీంతో హుండీ ఆదాయం కూడా బాగా తగ్గిందన్న అభిప్రాయంలో టిటిడి ఉంది.