మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (09:21 IST)

మంత్రి క‌న్న‌బాబు ఇంటి ముందు... కోవిడ్ కార్మికుల‌ ఆకలి కేకలు

కాకినాడ నగరపాలక సంస్థలో 8 నెలలుగా కోవిడ్, ఎం ఎన్ ఆర్, బదిలీ కార్మికులకు జీతాలు లేక విల‌విల  ఆడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తూ, వేతనాలు విడుదల చేయాలని ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులందరూ ప్రదర్శనగా వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నివాసాన్ని ముట్టడించారు.
 
పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని, మా ఆకలి బాధలు ప్రభుత్వం తీర్చాలని, న్యాయం చేయాలని పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు. వెంటనే కన్నబాబు త‌న నివాసం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి,  కార్మికుల వద్దకు చేరుకుని సమస్యలను ఏ ఐ టి యు సి ఉపాధ్యక్షుడు తాటిపాక మధుని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంటనే స్పందిస్తూ, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి ఫోన్ చేసి, జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరగా, ఆయన విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి, జీతాలు లేకపోతే, వీరు ఎలా బతుకుతారని ప్ర‌శ్నించారు.  తక్షణం రెండు నెలల జీతం వెంటనే వేయమని కోరగా, కమిషనర్ సాయంత్రం నాటికి రెండు నెలలు జీతాలు ఇస్తానని హామీ ఇచ్చారు.
 
ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ , పి ఎస్ నారాయణ ,మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీను, సత్యనారాయణ, ప్రకాష్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో నెల జీతం లేకపోతేనే అల్లాడిపోతున్నామని, అటువంటిది ఎనిమిది నెలలు జీతాలు లేకపోతే ఎలా బతుకుతారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఇస్తామని చెబుతూ రోజు రోజు కాలం గడుపుతున్నారని, ఇక సోమవారం నాటికి జీతం లేకపోతే దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్దామని నాయకులు  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తుపాకుల నారాయణ, మీసాల అనిత, మణికంఠ, దుర్గా, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.