సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:07 IST)

ఏపీకి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మంజూరుతో ప‌దివేల కోట్ల పెట్టుబ‌డుల రాక‌

Ramachandra Reddy
ఆంధ్రప్రదేశ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని, ఇది హర్షణీయమని ప్రముఖ శాస్త్రవేత్త, ఎస్సార్సీ ల్యాబోరేటరీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. దీనివ‌ల్ల ఏపీకి 10 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డులు రానున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


బ‌ల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే సాధించేందుకు కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ‌లో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, బల్క్ డ్రగ్ పార్క్ స్థాపన ద్వారా ఏపీకి రూ 10 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, రానున్న ఎనిమిదేళ్లలో ఈ పార్కు  ద్వారా రూ 50 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్నారు. 

 
బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తిలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చైనా ప్రధమ స్థానంలో ఉందని, ఈ నూతన పార్కు రావడం ద్వారా మన దేశం ప్రధమ స్థానంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని డాక్టర్ ఏలూరి అన్నారు. ఫార్మ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు, రాయితీల ఇచ్చి మరింత ప్రోత్సాహించాలని ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల ద్వారా కరోనా లాంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ ఏలూరి  రామచంద్రారెడ్డి భరోసా వ్యక్తం చేశారు.