శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (13:15 IST)

కరోనా కేసులు పెరిగినా... గణతంత్ర వేడుకలను ఘనంగా ఏర్పాట్లు

విజయవాడలో ఈ నెల 26 న స్థానిక ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు ఒక పక్క పెరిగిపోతున్నా, ఈ వేడుకలు మాత్రం జరిపి తీరాలని అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.


ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం, అడిషనల్ డీజీపీ శంకరభాత బాగ్చి, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ నివాస్ పెరేడ్ గ్రౌండ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పొంచి ఉన్న ఒమిక్రొన్ పట్ల జాగ్రత్త గా ఉండాలని అధికారులను కోరారు. 
 
 
గణతంత్ర వేడుకలకు కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించమని ఆదేశాలను గుర్తు చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొనే ఈ వేడుకలకు అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధం చేయాలన్నారు. గత వేడుకల అనుభవాన్ని, లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. 
 
 
ప్రోటోకాల్ నిబంధనల మేరకు వివిఐపి, విఐపిలకు ప్రత్యేకంగా సిటింగ్ అరేంజ్ మెంట్స్ ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే  వేడుకలు కాబట్టి ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, నవరత్నాలు కార్యక్రమ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.