1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (09:49 IST)

ఏపీలో డీఎస్సీ పోస్టులు... దివ్యాంగులకు 54 యేళ్ళ వరకు అవకాశం...

botsa
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ 2024 షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏడు యాజమాన్య పాఠశాల్లో
కలిపి మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సచివాలయంలో బుధవారం డీఎస్సీ, టెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెట్‌కు గురువారం నుంచి, డీఎస్సీకి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించామన్నారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్ 8వ తేదీన పోస్టింగులు ఇస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించినట్లు తెలిపారు. 
 
డీఎస్సీ, టెట్ రెండింటికీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయిస్తామని కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ప్రాతిపదికన కేంద్రాలను కేటాయించనున్నట్లు తెలిపారు. డీఎస్సీ, టెట్‌పై సందేహాలకు గురువారం నుంచి సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, వెబ్‌సైట్లో వివరాలు పెడతామన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
 
కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రకటిస్తే వీటిలో దాదాపు సగం పోస్టులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో 1,022 ఎస్జీటీ ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంగా ఈ జిల్లాలో 1,750 ఎస్జీటీ ఖాళీలున్నాయి. మొదట 2,150 పోస్టులు అవసరం కానున్నట్లు ప్రతిపాదించిన అధికారులు ఆ తర్వాత వీటిని 1,750కి.. అనంతరం 1022కు కుదించారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 37 మందికి ఒక ఎస్జీటీ ఉన్నారు.