కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి దుర్గ గుడి పట్టు వస్త్రాలు
కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రి తరుపున ఆలయ కార్యనిర్వహణాధికారిణి డి.భ్రమరాంబ పట్టు వస్త్రములు సమర్పించారు. దుర్గ గుడి నుంచి ఆలయ బృందం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చేరుకోగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి ఎ.వెంకటేశు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ కోవిడ్ నిబందనలు పాటిస్తూ, పట్టు వస్త్రములతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం చేసుకున్నారు. విజయవాడ నుంచి తీసుకెళ్లిన పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించారు.
శ్రీ స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి వెంకటేశు, దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి స్వామివారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్రు, ఆర్.శ్రీనివాస శాస్త్రి, ఆలయ అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు, ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.