ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (15:06 IST)

జ‌గ‌న్ , చంద్రబాబుల కంటే, కాపుల్లో అందగాళ్లు, తెలివైన వాళ్ళు లేరా?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్ట‌ర్ చింతా మోహ‌న్ ఈ రోజు రాజ‌కీయంగా వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాపు, బలిజలకు రాజ్యాధికారం తీసుకొస్తాం అని చెప్పారు. 2024లో రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేది కాపు, బలిజ వ్యక్తే అని చింతా మోహ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
 
కాపు ముఖ్యమంత్రికి శాలువా కప్పే వరకు త‌న ప్రయత్నం ఆగద‌ని, రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే, కోటి మంది కాపు, బలిజలు ఉన్నార‌ని డాక్ట‌ర్ చింతా మోహ‌న్ లెక్క‌లు చెప్పారు. వీళ్ళ‌ని ఒక్క రోజు కూడా అధికారం చూడలేద‌ని, చంద్రబాబు, జగన్ బాబుల కంటే, కాపు, బలిజలలో అందగాళ్లు, తెలివైన వాళ్ళు  లేరా? అని ప్ర‌శ్నించారు. 

 
చంద్రబాబు నాయుడూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసింది చాలు... ఇక సర్దుకో... 3 శాతం ఉన్న మీ సామాజిక వర్గం 25ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించింది. 3 శాతం ఉన్న మరో సామాజిక వర్గం 45 ఏళ్లు అధికారం అనుభవించింది. మళ్ళీ సీయంగా చంద్రబాబు, జగన్ బాబులు ఇద్దరూ వ‌ద్ద‌ని ఆయ‌న చెప్పారు.  

 
కాపు, బలిజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నార‌ని, అధికారంతో ఆర్థికంగా ఎదగలర‌న్నారు. మంచి పరిపాలనా దక్షుడు, ప్రజామోదం కలిగిన కాపు,  బలిజ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉంద‌ని చింతా మోహ‌న్ చెప్పారు. 

 
అమరావతి విషయంలో చంద్రబాబుది తొందరపాటు అని, క్రెడిట్ అంతా తనకే దక్కాలనే దురాలోచనతో, ఆనాడు ప్రధానిచే భూమి పూజ చేయించార‌న్నారు. చంద్రబాబు వల్లే, అమరావతి రైతులు నేడు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నార‌ని చెప్పారు. విజయవాడనో, పల్నాడు ఏరియానో రాజధానిగా చేసి ఉంటే బాగుండేద‌ని, తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రైతులను చంద్రబాబు చలిలో తిప్పుతున్నాడ‌ని విమ‌ర్శించారు. 

 
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరుపతికి, మన రాష్ట్రానికి చేసిందేమిటి? తిరుపతి మహిళలకు వచ్చిన 7008 రెండు బెడ్ రూం ఇండ్లు, దుగ్గ‌రాజ పట్టణం ఓడ రేవును ఆపిన చంద్రబాబు, ఈ ప్రాంత ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల‌న్నారు. ఇక రాష్ట్రంలో పరిపాలన చాలా అధ్వానంగా ఉంద‌ని, నిరుద్యోగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంద‌ని, ఆకలి కేకలు ఎక్కువగా వినిపిన్నాయ‌ని, వర్షాలు, వరదలు వల్ల పంటలు కొట్టుకుపోయి, రైతులు నష్టపోయార‌ని, వారిని ఆదుకోవాల‌ని డిమాండు చేశారు.  

 
80లక్షల మంది విద్యార్థులు రెండు సంవత్సరాల గా వారికి రావాల్సిన వేల కోట్ల స్కాలర్ షిప్పులు రాక,  కన్నీటితో ఉన్నార‌ని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బాధతో, భయంతో రోజులు గడుపుతున్నార‌ని చెప్పారు. వేల కోట్లు రూపాయలు సొంత ప్రయోజనాలు కొరుకు,  ఆయన తన పేరు పెంచుకునేందుకు  జగనన్న విద్యాదీవెన, జగనన్నవసతి దీవెన, జగనన్న గోరు ముద్ద  అమలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.