శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (12:07 IST)

ఏపీ డిప్యూటీ సీఎం అనుచరుడు తలపై బండరాయితో కొట్టి చంపేశారు...

రాయలసీమలో ఫ్యాక్షన్ హత్య జరిగింది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మొది హత్య చేశారు. 
 
బుధవారం జరిగిన ఈ ఫ్యాక్షన్ హత్య కర్నూలు జిల్లా డోన్ మండలం, తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్‌ను అడ్డగించిన దుండగులు రాడ్లు, కర్రలతో దాడిచేశారు. అనంతరం బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. 
 
ఆ తర్వాత  దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. తాపలకొత్తూరు వద్ద శేఖర రెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. 
 
మే 23వ తేదీ గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక్కరోజు ముందు ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు.