సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 5 జులై 2018 (16:19 IST)

ఆ ఇంట్లో దెయ్యముందా? నిప్పు లేకుండా మంటలు.. కాలిబూడిదైన రూ. 2.5 లక్షలు

ఆ ఇంట్లో ఏ వస్తువు పెట్టినా అగ్గికి బుగ్గి కావాల్సిందే. అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు చెలరేగుతున్నాయి. మూడు నెలల పాటు ఇంట్లోని ప్రతీది కాలి బూడిద

ఆ ఇంట్లో ఏ వస్తువు పెట్టినా అగ్గికి బుగ్గి కావాల్సిందే. అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు చెలరేగుతున్నాయి. మూడు నెలల పాటు ఇంట్లోని ప్రతీది కాలి బూడిదవుతుంది. ఈ మంటలు నిప్పులేకపోయినా ఎలా చెలరేగుతున్నాయని తెలియక ఆ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనంత జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి  గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంటోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చండ్రాని పల్లి గ్రామానికి చెందిన తిరుపాల్‌, శేఖర్‌, చెన్నుడు ముగ్గురు అన్నదమ్ములు. వీరంతా ఒకే చోట ఇళ్లు కట్టుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే మూడు నెలల క్రితం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తొలుత ప్రమాదవశాత్తుగా భావించిన అన్నదమ్ములు పెద్దగా పట్టించుకోలేదు. 
 
తర్వాత మరో ఇద్దరి ఇళ్లల్లో మంటలు రావడంతో ఏదో జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. తర్వాత రెండు మూడు రోజులకు ఓసారి ఉదయం, సాయంత్రం నిప్పులేకపోయినా మంటలు వస్తున్నాయి. ఈ మంటల్లో నిత్యావసరాల వస్తువులు, బట్టలు, పిల్లల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి. 
 
రెండు రోజుల క్రితం పంట సాగు కోసం రెండున్నర లక్షల రూపాయలు తెచ్చి బీరువాలో భద్రపరిచారు. రాత్రికి రాత్రి ఉన్నట్టుండి బీరువాలో మంటలు చెలరేగి నగదుతో పాటు విలువైన బట్టలు కాలి బూడిదయ్యాయి. దీంతో తమ ఇంట్లో దెయ్యం తిరుగుతోందని.. అందుచేతనే నిత్యం మంటలు చెలరేగి నష్టపరుస్తుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 
 
మంటలు ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు స్థానికులు ఇంట్లోనే ఉండగానే కళ్లెదుట మంటలు చెలరేగడంతో అవాక్కయ్యారు. ఇళ్లు ఖాళీ చేయమంటూ చెప్పి వెళ్లిపోయారు.