రామతీర్థం బోడి కొండపై ఉద్రిక్తత...ఊగిపోయిన అశోక గజపతి రాజు
విజయనగరంలోని రామతీర్ధం బోడి కొండపై గజపతి రాజులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోదండ రామ ఆలయ పున నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
రామతీర్ధం బోడి కొండపైకి చేరుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతి రాజు ఆవేశంతో ఊగిపోయారు. ప్రభుత్వ శిలాఫలకం ఏర్పాటును అడ్డుకున్నారు. ప్రభుత్వ శిలాఫలకాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆలయ అధికారులను గెంటివేశారు. ఒకపక్క ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ గజపతిరాజును పట్టించుకోకుండా అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. కొండపైకి మంత్రులు చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనితో అశోక్ గజపతిరాజు ఆలయ ట్రస్టీగా తీవ్ర నిరసన తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కానేకాదని, తమ పూర్వీకులు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలో ఏ కార్యక్రమానికి అయినా ఆనవాయితీ ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత తనని పిలవడానికి వచ్చారని, ఆలయ ధర్మకర్తగా ఇ.ఓకి తన అభిప్రాయం చెప్పానని అశోక గజపతి తెలిపారు.
గతంలో తన చెక్కు కూడా స్వీకరించలేదని, కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఈ దేశంలో న్యాయం ఉందా అన్న అనుమానం కలుగుతోందని, ప్రభుత్వాన్ని 7 ప్రశ్నలు అడుగుతున్నానని అన్నారు. తన ప్రశ్నలను ఎండోమెంట్ ఉన్నతాధికారులకు పోస్టులో పంపిస్తానన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 115 వరకు దేవాలయ ధ్వంసం ఘటనలు జరిగాయని, ఏ రోజు వాటి మీద దర్యాప్తు చేయలేదని, ఇక్కడ మాత్రం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.