1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (10:15 IST)

పెట్రో ధరలు తగ్గించకుండా, మద్యం ధరలు తగ్గిస్తే ఎవరికి ప్రయోజనం?

ఆకాశాన్ని అంటిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించకుండా ఎపీలో కేవలం మద్యం ధరలు తగ్గించడం వల్ల ఎవరికి ప్రయోజనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కరోనా విపత్కర కాలంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను కట్టడి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూసింది. 2014లో మోదీ అధికారంలోకి రాక ముందు లీటరు పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండగా, మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు ధర రూ.118, డీజిల్ ధర రూ.109కు చేరాయి. ప్రజల నుండి వ్యతిరేకత, పలు రాష్ట్రాలలో ఎన్నికలు సమీపించనున్న దృష్ట్యా కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను మొక్కుబడిగా తగ్గించి చేతులు దులుపుకుంది. పెట్రో ధరలపై కేంద్ర వైఖరిని తప్పుబడుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కొంత ఉపశమనం ప్రకటించాయి. నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహనరెడ్డి దక్షిణ భారతదేశంలోనే ఏపీలో అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని సాక్షాత్తూ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. కాని ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఎపీలోని పెట్రో ఉత్పత్తుల ధరలను సమర్ధించుకుంటూ పత్రికల్లో కోట్లాది రూపాయల ప్రకటనలివ్వడం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటని రామ‌కృష్ణ విమ‌ర్శించారు.
 
 
 
ఎపీలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు కోరితే జగన్ సర్కార్ మద్యం ధరలు తగ్గించింది. సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ జీవో ఇచ్చింది. ఒకవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, వంటనూనెలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా ఉంటే మరోవైపు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్తపన్ను, మంచినీటి చార్జీలు, విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారాన్ని గుదిబండగా మోపింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్మోహనరెడ్డి తానిచ్చిన మద్య నిషేధం అమలు హామీని తుంగలోతొక్కారు. కరోనా విపత్కర కాలంలో అన్నింటా ఆంక్షలు అమలవ్వగా ఎపీలో కేవలం మద్యం షాపులు తెరిచి, కోట్లాది రూపాయల అమ్మకాలు సాగించారు. ఇప్పుడు మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజావసరాలైన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా మద్యం ధరలను తగ్గించడం వల్ల ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నాం. పొరుగునున్న తమిళనాడు కన్నా ఎపీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 అధికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కనీసం తమిళనాడు తరహాలోనైన తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామ‌ని, రామకృష్ణ చెప్పారు.