మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (18:01 IST)

అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత - వైకాపా వర్సెస్ టీడీపీ

అనంతపురం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార వైకాపా, టీడీపీకి చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీడీపీ, వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే రాప్తాడుకు వచ్చి మాట్లాడలని టీడీపీ కార్యకర్త అజయ్ సవాల్ విసిరాడు. దీనికి వైకాపా కార్యకర్త హరికృష్ణారెడ్డి.. ఇదిగో వచ్చాను చూడు.. అంటూ అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఓ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
దీంతో క్లాక్ టవర్ వద్దకు ఇరు పార్టీల నేతలు చేరుకుని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, రాళ్ల దాడిలో ఒక టీడీపీ కార్యకర్తతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అలాగే, వీడియోతో ఘర్షణకు రాజేసిన వైకాపా కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. హరికృష్ణారెడ్డిని ప్రివెంట్ కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు.