మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 30 జులై 2020 (19:53 IST)

మీకు దణ్ణం పెడతా, మీ సహాయం నాకు అవసరం లేదన్న చిత్తూరు రైతు, ఎందుకు?

కూతుర్లతో రెండు వైపులా కాడెద్దలు మోయించి వ్యవసాయం చేయించిన రైతు గుర్తున్నాడు కదా నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారైంది.

రైతుగా ఆర్థికపరిస్థితి బాగా లేక ఇబ్బంది పడుతుంటే ఏకంగా సోనూసూద్ అతనికి ట్రాక్టర్‌ను కొని ఇచ్చారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెలను చదవిస్తానని హామీ ఇచ్చారు.
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఒక లేఖను పంపి ఇద్దరు కూతుర్లకు మహిళా కాలేజీలో రెసిడెన్షియల్ సౌకర్యంతో ఉచితంగా చదివిస్తానని చెప్పారట. రాజకీయంగా గతంలో లోక్‌సత్తాలో ఉన్నారు నాగేశ్వరరావు.
 
చంద్రబాబు సహాయం చేస్తానని చెప్పడంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. దీంతో నాగేశ్వరరావు బాగా ఆర్థికంగా ఉన్న వ్యక్తి అంటూ ప్రచారం ప్రారంభమైంది. కావాలనే కూతుర్ల దగ్గర కాడె మోయించి ఇలా చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన రైతు నాగేశ్వరరావు ప్రస్తుతం చంద్రబాబు ఆఫర్‌ను వద్దంటూ దణ్ణం పెట్టేశారట.
 
ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నాగేశ్వరావుకు ప్రతినిధులు ఫోన్ చేస్తే మీకు దణ్ణం పెడతా.. నాకు సహాయం అవసరం లేదు. నా బతుకు నన్ను బతకనివ్వండి. నాకు చాలా బాధగా ఉంది. రాజకీయం చేస్తున్నారు. నా బాధలు నా పక్కన ఉన్న వారికందరికీ తెలుసు. నాకు మీ సహాయం వద్దంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు చెప్పేశారట. అప్పు చేసైనా తన కూతుర్లను చదివించుకుంటానంటున్నాడట నాగేశ్వరరావు.