బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (16:03 IST)

దుష్ప్రచారం చేయొద్దు.. తానంటే ఏమిటో ఉదయగిరిలో చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే మేకపాటి

mekapati chandrasekhar reddy
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తనపై సాగుతున్న దుష్ప్రచారంపై వైకాపా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నేతలే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన వాపోయారు. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఒకరు ఓడిపోగా, రెబెల్స్ మినహా 19 మంది సభ్యుల మద్దతుతో బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా ఘన విజయం సాధించారు. ఇక్కడ వైకాపా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తేలింది. 
 
ఈ నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి, తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంపై స్పందించారు. పార్టీ అధిష్టానం చెప్పినట్టుగానే తాను వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసి వచ్చానని తెలిపారు. తాను వేసిన ఓటు వల్లే జయమంగళం గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలివేసి జగన్ కుటుంబం కోసం వచ్చానని ఆయన గుర్తుచేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో వైకాపా టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని లేకుంటా విరమించుకుంటానని చెప్పారు. అయితే, తనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో జగన్ సానుకూలంగా లేరని ఆయన స్పష్టం చేశారు. అదేసమయంలో తన నియోజకవర్గమైన ఉదయగిరిలో తానేంటో చూపిస్తానని మేకపాటి అన్నారు. తనకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.