12న షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం: ఇస్రో ప్రకటన
నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు.
2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్టమొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం.
2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.