బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (12:43 IST)

మోడికి జగన్‌ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఎపి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఎం జగన్‌ లేఖలో వివరించారు.

ఎపిలో 30 లక్షల మందికి ఇళ్ల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానికి వెల్లడించారు. 'పేదలందరికీ ఇళ్లు-పిఎంఎవై' పథకం సుస్థిరాభివద్ధికి దోహదం చేస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ప్రధానికి లేఖలో వివరించారు. 2022 కల్లా 'పేదలందరికీ ఇళ్లు-పిఎంఎవై' పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోడి సంకల్పం చాలా గొప్పదని సిఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

''ఎపి ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పిఎంఎవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి.

ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి' అని సిఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పిఎంఎవై కింద ఎపి కి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సిఎం వైఎస్‌ జగన్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని కోరారు.