శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:38 IST)

జగన్ వంద రోజుల పాలనను తూర్పారబట్టిన జాతీయ పత్రికలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనను జాతీయ పత్రికలు తూర్పారబట్టాయి. వైసీపీ వందరోజుల పాలనపై పలు జాతీయ ఆంగ్ల దినపత్రికలు సంపాదకీయాలు రాశాయి. ఇవి గురు శుక్రవారాల్లో ప్రచురించబడ్డాయి. ఈ నెల 7న వందరోజుల పాలన పూర్తిచేసుకున్న జగన్మోహన్‌ రెడ్డి పబ్లిక్ పాలసీని తన ఆకాంక్షలతో ముడిపెడుతున్నారని, ఇది సమర్థనీయం కాదని 'హిందుస్తాన్ టైమ్స్' పేర్కొంది.
 
అధికారంలోకి రాగానే అమరావతిలో చంద్రబాబు నిర్మించిన 9 కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూలగొట్టించడం, భూముల సమీకరణలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపిస్తూ కొత్తరాజధాని నిర్మాణ పనులను నిలిపివేయడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని రాసింది. అమరావతికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యమివ్వకపోవడానికి కమ్మ సామాజిక వర్గం లబ్ధి పొందకుండా చూడడం, రెడ్డి సామాజికవర్గానికి ప్రయోజనం కలిగించడం అనేది ఒక కారణంగా కనిపిస్తోందని రాజధాని విషయంలో కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదంది.
 
అమరావతిలో ఇంతవరకు జరిగిన నిర్మాణాలు, కూల్చివేతలు పూర్తిగా ప్రజల సొమ్ముతోనే జరిగాయని, అమరావతి నిర్మాణాన్ని నిలిపివేస్తే భూములిచ్చిన రైతుల విషయమేమిటని ప్రశ్నించింది. అమరావతి ప్రాజెక్టును పూర్తిగా రాజకీయ కారణాలతో నిలిపివేస్తే ఇంతవరకు జరిగిన నిర్మాణాలకు వ్యయమయిన ప్రభుత్వ ఆర్థిక వనరులు వృథా అయిపోయినట్టే అని... ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన సొమ్మును ఇలా వ్యర్థం చేయడం నేరపూరిత చర్యే అవుతుందని... అందువల్ల అమరావతి భవిష్యత్తు విషయమై ఒక స్పష్టమైన పథకంతో ముఖ్యమంత్రి ప్రజల ముందుకురావాలని పేర్కొంది.