వైకాపా నేతలు ఉగ్రవాదులుగా మారిపోయారు.. రంగురాళ్లుగా నవరత్నాలు
రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి.. వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి మిత్రుడైనప్పటికీ.. వైకాపాపై దుమ్మెత్తిపోశారు. వైసీపీ నేతలు రాజకీయ ఉగ్రవాదులుగా మారి గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన పవన్ రెడ్డి టీడీపీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే వైఎస్ జగన్ పాలనపై ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా శ్రేయస్సును వదిలేసి ముఖ్యమంత్రి సంఘ విద్రోహశక్తిగా తయారయ్యారని విమర్శించారు.
ప్రతి విషయంలో మోసం చేసి నవరత్నాలను జగన్ రంగురాళ్లుగా మారుస్తారని పవన్ వ్యాఖ్యానించారు. కరువు ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు రూ.969 కోట్ల నిధులు కేటాయిస్తే జగన్ ఈ బడ్జెట్‌లో రూ.36 కోట్లు కేటాయించడం జగన్ అవగాహనా రాహిత్యానికి, అనుభవ రాహిత్యానికి నిదర్శనమన్నారు.