గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (20:05 IST)

కోవిడ్‌తో ప్రముఖ జర్నలిస్టు మృతి, 20 రోజుల క్రితమే తండ్రి కూడా కరోనాతో మృతి

వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కులోనూ పనిచేసిన పామర్తి పవన్ కుమార్ (38) శుక్రవారం తెల్లవారుఝామున కోవిడ్ తో మృతి చెందారు. ఆయనకు కోవిడ్ సోకిన తరువాత చికిత్స తీసుకుంటుండగా, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో బుధవారం కృష్ణా జిల్లా వుయ్యూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ లేదా హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించడం కోసం ప్రయత్నాలు జరిగాయి.

ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనీ, మెరుగైన ఆసుపత్రిలోచికిత్స అందించాలని స్థానిక వైద్యులు సూచించారు. అప్పటి వరకూ ఆక్సిజన్ అందించారు. అయితే శుక్రవారం ఏదైనా ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేసే లోపు, తెల్లవారుఝామను అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి పడిపోయి, తుది శ్వాస విడిచారు.

టీవీ9, ఎన్టీవీ, సీవీఆర్, హెచ్ఎంటీవీ, ఎక్స్ ప్రెస్ టీవీ, సాక్షీటీవీలలో ఆయన పనిచేశారు. తన కథనాలకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి నేషనల్ టెలివిజన్ అవార్డు సహా పలు అవార్డులు పొందారు. అంతకు సుమారు 20 రోజుల క్రితమే ఆయన తండ్రి కరోనాతో మరణించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలం గూడపాడు గ్రామం. ఆయనకు భార్య మధు శ్రావణి, పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.