శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (17:41 IST)

తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి కృషి చేద్దాము: ఎమ్మెల్యే భూమన

తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి సమిష్టి కృషి చేద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వై.ఎస్.ఆర్ సమావేశ మందిరంలో తిరుపతి సిటి లెవల్ అడ్వైజరి పోరం కమిటి సమావేశం తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ అధ్యక్షతన మంగళవారం జరిగింది.
 
ఈ సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి స్మార్ట్ సిటి ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకొని,ఆలస్యంగ నడుస్తున్న పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణానికి ఇస్తామన్న అవసరమైన నిధుల విడుదలకు టిటిడికి లేఖ వ్రాయాలని స్మార్ట్ సిటీ ఎం.డి గిరీషాకి సూచించారు.

తిరుపతిలో వాహనాల పార్కింగ్ సమస్యను తీర్చేందుకు ముఖ్యంగ పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నిర్మాణంలో వున్న మల్టి లెవల్ పార్కింగ్ బిల్డింగ్స్ పూర్తి చేసి వెహికల్ పార్కింగ్ సమస్యలను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. వినాయకసాగర్,గొల్లవాని గుంట ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడం వలన ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో సేదతీరేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీకి పలు విభాగాల్లో అవార్డులు రావడాన్ని ప్రస్థావిస్తూ కమిషనర్ గిరీషను, అధికారులను అభినందిస్తూ మనమంతా కలిసికట్టుగా తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు
 
తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ అధికారుల పనితీరుకు అవార్డులు రావడం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ మరిన్ని విభాగాల్లో పనితీరు మెరుగుపరిచి మరింత అభివృద్ధికి పాటుపడాలన్నారు. డ్రైనేజి, త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. నిర్మాణంలో వున్న నీటి ట్యాంకుల పనులను వేగవంతం చేసి నీటి యద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని మేయర్ శిరీషా కోరారు.
 
తిరుపతి స్మార్ట్ సిటీ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ గరుడవారధి నిర్మాణానికి ఇప్పటికే కార్పొరేషన్ ఇవ్వవల్సిన రెండు వందల కోట్లు ఇచ్చేసి పనులను వేగవంతం చేసిందని, టిటిడి ఇవ్వవల్సిన 458 కోట్లకుగాను ఇప్పటి వరకు 25 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలియజేసారు. టిటిడి నిధుల మంజూరు అయితే కొద్ది నెలలోనే వాహనాలు గరుడ వారధిపైకి వచ్చేలా పనిచేసేందుకు అందరూ సిద్దంగా వున్నట్లు వివరించారు.

రూప్ టాప్ సోలార్ విధ్యుత్ తిరుపతిలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్స్ భవనాలపై ఏర్పాటుచేసినందు వలన ఇప్పుడు నెలకి ఐదు లక్షలకు పైగా విధ్యుత్ బిల్లులు ఆదా అయినట్లు వివరించారు. అదేవిధంగ అండర్ కేబుల్ వర్కులు జరుగుతున్నాయని, ఈ వర్కులు పూరైతే ప్రజలకు సౌకర్యవంతంగ వుంటుందసి వివరించారు. శానిటేషన్ గురించి వివరిస్తూ తడి,పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తను ఎరువుగా మారుస్తున్న విధానాలను వివరించారు.

ఇందిరామైదానంలో జరుగుతున్న పనులను వివరిస్తూ మల్టిల్ లెవర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడం వలన క్రీడాకారులకు ఉపయోగకరంగ వుంటుందన్నారు.పెండింగ్ లో వున్న పనుల అభివృద్ధికి అధికారులను,కాంట్రాక్టర్లను మరింత వేగవంతమైన పనులకు పురమాయించడం చేస్తామని తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ తెలిపారు.
 
ఈ సమావేశంలో తిరుపతి ఎం.ఎల్.సి. యండపల్లి శ్రీనివాసులు రెడ్డి,స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి,డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ,పోరం సభ్యులు డాక్టర్ జెల్లి మునిశేఖర్ యాదవ్,మాంగాటి గోపాల్ రెడ్డి,కైలాష్,ఏయికామ్ భాలాజీ,మునిసిఫల్ ఇంజినీర్లు చంద్రశేఖర్,వెంకట్రామి రెడ్డి,డిఈ విజయ్ కుమార్ రెడ్డి,ఏఏఓ రాజశేఖర్,సిఎప్ ఓ మల్లిఖార్జున్ లు పాల్గొన్నారు.