సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (13:56 IST)

కరోనా వైరస్ దెబ్బకు మూతపడిన శ్రీహరి కోట షార్ సెంటర్

కరోనా వైరస్‌కు ఒక ప్రాంతం, ఒక దేశం అంటూ ఏదీ లేకుండా పోయింది. ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు శ్రీహరికోటలోని షార్ సెంటర్ కూడా మూతపడింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట‌లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఎస్‌డి‌ఎస్సీ-షార్ )లో లాక్డౌన్‌  విధించారు. షార్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇద్దరు సిబ్బందితోపాటు మరో ఇద్దరు వారి కుటుంబ సభ్యులు కోవిడ్ -19 సోకినవారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షార్‌లో లాక్డౌన్‌ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసారు. 
 
తాగునీరు, విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది అవసరాలు మినహా అన్ని సేవలను బంద్‌ చేయనున్నారు. కరోనా సోకినా సిబ్బంది ఉండే ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.
 
కరోనా సోకిన ఇద్దరు ఉద్యోగులు విధులకు హాజరుకావడంతో షార్ అంతటా గందరగోళం నెలకొంది. మరికొంతమందికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా సోకిన వారికి దగ్గరగా ఉన్నవారితోపాటు అనుమానం ఉన్న వారిని గుర్తించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. మొత్తంమీద కరోనా వైరస్ దెబ్బకు షార్ సెంటర్ మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.