శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (21:58 IST)

రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా చర్యలు: డిఐజి రంగనాధ్

నల్లగొండ: రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ జిల్లాను నకిలీ విత్తన రహితంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. శుక్రవారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ అధికారులతో డిజిపి మహేందర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నకిలీ విత్తనాల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను అభినందించారు.

ఈ సందర్భంగా డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై పిడి యాక్ట్ నమోదు చేశామని, ఈ సీజన్ లో ఇప్పటి వరకు జిల్లాలో మూడు కేసులు నమోదు చేయడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలలో ముఖ్యంగా కాలం చెల్లిన విత్తనాలు, తిరస్కరించబడిన విత్తనాలను సేకరించి రైతులను మోసం చేస్తున్న  విషయంలో ఎక్కువ దృష్టి సారించి నకిలీ విత్తనాలు లేని జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు.
 
డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కల్తీ విత్తన రహితంగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పోలీస్ అధికారులంతా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలవాలని డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి శ్రమ వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు అండగా, వారికి వెన్నుదన్నుగా నిలవాలని ఇందుకోసం క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావం, నిబద్ధతతో  పని చేయడం ద్వారా నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు.

రాబోయే 15 రోజుల పాటు నకిలీ విత్తనాలపై మరింత దృష్టి సారించి నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టడం, సరైన సమాచారం సేకరించి వాటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకునే అధికారులకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా రివార్డులు అందించడం జరుగుతుందని, నకిలీ పత్తి, మిరప విత్తనాల విషయంలో ఎక్కువ దృష్టి సారించడం ద్వారా ప్రస్తుత సీజన్ లో ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు.
 
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.