గురువారం, 22 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉదయగిరి మెరిట్స్ కాలేజీలో మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఈ అంత్యక్రియలను తొలుత ఆయన స్వగ్రామైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని భావించారు. కానీ, ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో వీటిని నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని గౌతం రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉదయం కన్నుమూసిన గౌతం రెడ్డి పార్ధిదేహాన్ని మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ ద్వారా తొలుత నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి గౌతం రెడ్డి నివాసానికి తరలిస్తారు. 
 
ఇక్కడే ప్రజలు, మేకపాటి అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుంతారు. అదేసమయంలో అమెరికాలో ఉన్న గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి మంగళవారం సాయంత్రానికి నెల్లూరుకు చేరుకుంటారు. ఆ తర్వాత అంటే మరుసటి రోజున ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీ ప్రాంగణంలో మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.