శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:22 IST)

సోషల్ మీడియా ఉందికదాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా

లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు పూలతో స్వాగతం పలికారు. అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే రోజా నడుచుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. 
 
కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జనం బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. సమూహంగా ఉండడానికి వీల్లేదు. అయితే అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రోజా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా.. మంచి పేరు వచ్చే విధంగా పని చేస్తుంటే.. తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడమన్నారు. సోషల్ మీడియా ఉందికదాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానని రోజా హెచ్చరించారు.
 
తన నియోజవర్గంలోని సుందరయ్యనగర్‌ ప్రజలు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని రోజా విమర్శించారు. తమ ప్రభుత్వం పెద్దమనసుతో ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇస్తే.. ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా తనను ఆహ్వానించారని.. అయితే వాళ్లు పూలు జల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. ప్రేమతో వారు చేసిన పనికి ఇబ్బందిపెట్టకూడదని అనుకున్నానని రోజా వివరించారు. దాన్ని టీడీపీ నేతలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.