మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (09:44 IST)

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

montha cyclone
మొంథా తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయ. రాష్ట్రంలోని పోర్టులకు  హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని తెలిపింది. 
 
ఇది మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.