సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (13:32 IST)

చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు: నారా లోకేష్

ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన నారా లోకేష్ ఏపీ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ గతంలో కోర్టులో పేర్కొన్నాయని, అయినప్పటికీ తాను పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళు అని నమ్మించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
 
ఈ కేసులో 21 నెలలపాటు శోధించి శోధించి అలసిపోయిన జగన్ ఆఖరుకు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారని, చంద్రబాబు తెల్లగడ్డం మీదున్న తెల్లని వెంట్రుకల్లో ఒక్కటి కూడా పీకలేరని నారా లోకేష్ మండిపడ్డారు. సీఎం జగన్ అమరావతిని ముక్కలు చేయడానికి ఎన్ని ఎత్తులు వేసినా కాపాడుకొని తీరుతామని లోకేష్ పేర్కొన్నారు. సిల్లీ కేసులతో చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. రాజధాని భూముల వ్యవహారంపై 21 నెలలుగా ఏం చేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఫలితాలు రాగానే అధికార మదం తలకెక్కిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏం చేసినా చెల్లుతుందని జగన్ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధాని భూముల్లో అవకతవకలు జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబును కించపరిచేందుకే సీఐడీ నోటీసులు జారీ చేశారన్నారు. 
 
సీబీఐ దగ్గరకు జగన్ వెళ్లినట్లు చంద్రబాబును సీఐడీ దగ్గరకు వెళ్లేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అన్నారు. తాము ఓడినంత మాత్రాన భయపడేది లేదన్నారు. వైసీపీ చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 2024లో తమ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.