గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 మే 2020 (20:31 IST)

తిరుపతిలో పేద ముస్లింలకు నాట్స్ సాయం: రంజాన్ ముగిసే వరకు నిత్యావసరాలు పంపిణీ

తిరుపతి: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. ఇటు తెలుగు నాట కూడా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తోంది. వారికి ఆకలి బాధలు లేకుండా చేయడంలో తన వంతు కృషి చేస్తోంది. తాజాగా తిరుపతిలో ముస్లిం కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. 
 
రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస విరమణ సమయంలో పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన ఆహారం కూడా లభ్యం కావడంలేదు. ఈ విషయం నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ శేఖర్ అన్నే దృష్టికి రావడంతో వెంటనే ఆయన స్పందించారు. నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి సహకారంతో వెంటనే పేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. 
 
తిరుపతిలోని యశోదా నగర్, సప్తగిరి నగర్, శాంతినగర్, నెహ్రు నగర్‌లోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ నెల అంతా నిత్యావసరాలు అందేలా చర్యలు చేపట్టారు. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో రంజాన్ పండుగ రావడం.. పండుగ రోజుల్లోనే పూట గడవడం ప్రశ్నార్థకంగా మారిందని.. ఈ సమయంలో నాట్స్ తమకు నిత్యావసరాలు పంపిణీ చేయడం తమకు ఎంతో మేలు చేసిందని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయంలో విజయ్ శేఖర్ అన్నే చూపిన చొరవను స్థానిక ముస్లిం పెద్దలు ప్రశంసించారు. ఈ లాక్ డౌన్ సమయంలో పేద ముస్లిం ప్రజలు తమ దినసరి వేతనాలను కోల్పోయి, ప్రతిరోజు సాయంత్రం రంజాన్ దీక్ష విరమించటానికి సరైన ఆహార సదుపాయాలు లేక దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. ఈ సమయంలో నాట్స్ వైస్ ప్రెసిడెంట్ అన్నే శేఖర్ కల్పించుకొని రంజాన్ నెల రోజుల పాటు పేద ముస్లింలకు నిత్యావసరాలు అందించటం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక వి.ఆర్.ఓ షేక్ సనావుల్లా అన్నారు.