బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:47 IST)

ఆన్ లైన్ చ‌దువుల వ్యాపారం రూ. లక్షా 13 వేల కోట్లకు!

నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)- 2020ని కేంద్రం ప్రకటించింది కేవ‌లం ఆన్ లైన్ చ‌దువుల వ్యాపారాన్ని పెంచ‌డానికా అనే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కొత్త విద్యా విధానం వెనుక ఉన్న అసలు ఎజండా ఇదే అని విద్యావేత్త‌లు ఆరోపిస్తున్నారు.

ఎన్‌ఇపి ఎటువంటి తటపటాయింపులూ లేకుండా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతోంది. మరి ఈ ఆన్‌లైన్‌ చదువు ప్రస్తావన ఎందుకొచ్చింది? మే 1న ప్రధాని నూత‌న విద్యా విధానాన్నిప్రకటించిన వెంటనే గూగుల్‌ సంస్థ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ఆ వెనువెంటనే ఆన్‌లైన్‌ చదువుల వ్యాపారం వచ్చే నాలుగేళ్ళలో రూ. లక్షా 12 వేల అయిదు వందల కోట్లకు పెరగనుందని ఒక మార్కెటింగ్‌ ఏజన్సీ అంచనాలు ప్రకటించింది. అంటే ప్రధాని ఆన్‌లైన్‌ చదువుల గురించి ప్రకటించింది చదువుల నాణ్యతను పెంచడం కోసం కాదు. కార్పొరేట్ల వ్యాపారానికి, దోపిడీకి అవకాశాలు పెంచడం కోసమే అని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

మే 1 ప్రధాని మోడీ ఎన్‌ఇపి ని సమీక్షిస్తూ, మన విద్యా విధానానికి గుండెకాయలా ఆన్‌లైన్‌ విద్యాబోధన ఉండబోతోందని ప్రకటించారు. మన చదువుల నాణ్యత పెరగడానికి, ప్రపంచ స్థాయికి మన విద్యా విధానం చేరుకోడానికి ఆన్‌లైన్‌ విద్యా బోధన దోహదం చేస్తుందని మోడీ అన్నారు.

ఇక్కడ రెండు సందేహాలు తలెత్తుతాయి. మొదటిది-ఆన్‌లైన్‌ చదువు వలన విద్య నాణ్యత పెరిగినట్టు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా?తద్విరుద్ధంగా ఉపాధ్యాయునికి, విద్యార్ధికి మధ్య ప్రత్యక్ష మానవ సంబంధం లేకుండా ఉంటే, విద్యార్ధి నేర్చుకోగలిగే సామర్ధ్యం తగ్గిపోతుందని చెప్పడానికి కావలిసినన్ని దృష్టాంతాలు ఉన్నాయి.

ఇక రెండవది-ఈ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలేమిటి? వీటిని ఎవరు నిర్ణయించారు? మన దేశంలోని ఉన్నత విద్యాలయాలు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో మొదటి 100 ర్యాంకుల్లోనూ ఉండాలని కోరుకోవడం ఈ మధ్య పరిపాటి అయింది. అయితే ఈ ర్యాంకులను నిర్ణయించేది మార్కెట్‌ శక్తులే తప్ప విద్యావేత్తలు కారు. విద్యా వ్యాపారానికి అనుగుణంగా ఈ ర్యాంకులు నిర్ధారించబడతాయి తప్ప సమాజాన్ని మార్చడంలో, పై మెట్టుకు తీసుకుపోవడంలో విద్య ఎటువంటి పాత్రను పోషించిందన్నది వాటికి పట్టదు.

ఇదే దిశగా యుజిసి కూడా వ్యవహరిస్తోంది. తొలుత యూనివర్సిటీలు కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షలను నిర్వహించాలా వద్దా అన్నది ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే నిర్ణయించుకోవచ్చునని అనుమతించింది. కాని జూలై 6న అందుకు విరుద్ధంగా సెప్టెంబరు నెలాఖరు లోపు అన్ని యూనివర్సిటీలూ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి తీరాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది. అప్పటికే ఏడు రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేసినట్టు ప్రకటించారు కూడా. కాని ఆ నిర్ణయాలు చెల్లవని, పరీక్షలు జరిపితీరాలని యుజిసి ఆదేశించింది. ఇదంతా కొన్ని హైటెక్‌ కంపెనీల లాభాలను పెంచడానికే తోడ్పడుతుంది.

మొత్తం స్టార్స్‌ ప్రోగ్రాం (స్ట్రెందెనింగ్‌ టీచింగ్‌-లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌ ప్రోగ్రాం) కు అయ్యే ఖర్చులో కేవలం 1.4 శాతం మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇవ్వనుంది. అదికూడా రుణంగానే. అయినా ఆ ప్రపంచబ్యాంకు కనుసన్నలలోనే ఈ స్టార్స్‌ అంతా నిర్వహించనున్నారు. విద్యా వ్యాపారమే ప్రపంచబ్యాంకు ప్రధాన ఎజండా. దీనిని బట్టి ఎన్‌ఇపి వెనుక ఉన్నది నయా ఉదారవాద ఎజండా అన్నది స్పష్టం అవుతోంది.