ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (23:37 IST)

ఏపీలో రేపటి నుంచి 'మన పాలన - మీ సూచన' కార్యక్రమం..!!

ఏపీ ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జగన్ సర్కార్ కొలువుదీరి ఏడాది కావడంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై 'మన పాలన-మీ సూచన' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికశాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విజయకుమార్‌ వెల్లడించారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ఈ ప్రభుత్వం.. వారి ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో నూతన కార్యక్రమాన్ని తలపెట్టామని విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభం ఉంటుందని వివరించారు.

తాడేపల్లి నుంచి వీడియో ద్వారా ముఖ్యమంత వైఎస్ జగన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్ధిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని 50 మందికి మించకుండా పాల్గొనాలని సూచించారు.

అనంతరం ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి లక్ష్యాలు రూపొందిస్తామన్నారు. కార్యక్రమాలు చేపట్టనున్న తేదీలను కూడా వెల్లడించారు. ఈ నెల 25 పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం, 26వ తేది వ్యవసాయం, అనుబంధ రంగాలు, 27వ తేదీన విద్యారంగ సంస్కరణలు, పథకాలు, 28 పరిశ్రమలు, పెట్టుబడుల రంగం, 29 ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ వంటి వాటిపై అభిప్రాయాలూ స్వీకరించనున్నారు.