శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:59 IST)

ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో పరామర్శించనున్నారు. స్వయంగా ఆయన వారి ఇంటికి చేరుకుని.. కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. 
 
రాజు అనే కామాంధుడు ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పారిపోవడం తెలిసిందే. అతని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పైగా, అతన్ని పట్టిస్తే రూ.10 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 
 
ఈ పరిస్థితుల్లో చిన్నారి కుటుంబాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ కోవలో మంగళవారం సినీ నటుడు మంచు మనోజ్ కూడా సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, ఎమ్మెల్యే సీతక్క కూడా చిన్నారి తల్లిని ఓదార్చారు. 
 
ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు.. అటు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
 
మరోవైపు, రాజును అరెస్టు చేసి ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిందితుడు రాజును తప్పనిసరిగా పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.