శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:36 IST)

చాంద్రాయణగుట్టలో మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణ గుట్టలో ఓ కసాయి తండ్రి కన్నబిడ్డపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే హత్య చేస్తానంటూ బెదిరిస్తూ తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని అత్యాచారం చేయసాగాడు. చివరకు తల్లికి ఈ విషయం తెల్సిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు (14), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళ 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి (45)ని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా భార్యతో అంబర్‌పేటలో ఉంటున్నాడు. 
 
అయితే, అప్పుడప్పుడూ గౌస్‌నగర్‌లోని రెండో భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం కూతురును భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈనెల 13వ తేదీన ఈ దుశ్చర్యను తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.