ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

వైసీపీ ఏలుబడిలో ప్రజలు భయాందోళన: కన్నా

దాడులు, దౌర్జన్యాల వైసీపీ ఏలుబడిలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ సర్కారుకు దోపిడీ తప్ప ప్రజల ఆకలి కేకలు, కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదని మండిపడ్డారు.

ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను ఆకలితో చంపుతున్న రాక్షస ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన భవన నిర్మాణ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడులు.. నిజాలు వెల్లడించే పత్రికలకు సంకెళ్లు వేస్తూ జగన్‌ అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా నెలకొన్న ఇసుక కొరతపై బీజేపీ విజయవాడలో ఇసుక సత్యాగ్రహం చేపట్టింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్‌ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్‌, నేషనల్‌ లేబర్‌ బోర్డు ఛైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ, మాణిక్యాలరావు, రావెల కిశోర్‌బాబు, నాగోతు రమేశ్‌నాయుడు, కిలారు దిలీప్‌, విష్ణుకుమార్‌రాజు, గాయత్రి తదితర నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు.
 
భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతోంటే వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని కన్నా ఈ సందర్భంగా ఆరోపించారు. ఐదు నెలల పాలనలో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ సమస్యలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అవినీతి నిర్మూలన, అద్భుత పాలన అంటూ తియ్యటి పలుకులు పలికిన జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇసుక దోపిడీ ఎందుకు కనిపించడం లేదు? అప్పుడే పాలనపై పట్టు కోల్పోయారా..? లేక మే 30న చెప్పినవి అబద్ధాలా?

కూలీల ఆకలికి, భవన నిర్మాణ కార్మికుల బలవన్మరణాలకు 100 శాతం బాధ్యత ముఖ్యమంత్రిదే. ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్కరి కుటుంబానికీ రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.
 
జూన్‌ నుంచి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.10 వేల చొప్పున అక్టోబరు నాటికి రూ.50 వేలు చెల్లించాల్సిందే. మీ సొంత సంస్థల్లో పనిచేసే వాళ్లకు నెలకు రూ.4 లక్షల జీతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు.. మీ నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఎందుకివ్వరు?

వరదల వల్లే ఇసుక తీయలేక పోతున్నామని చెబుతున్న ఈ అసమర్థ ప్రభుత్వం.. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో వరదల్లేనప్పుడు ఎందుకు ఆపింది? కృష్ణా, గోదావరి లాంటి చోట్ల వరదలున్నా డ్రెడ్జింగ్‌ ద్వారా తీయొచ్చు. వరదల్లేని రాయలసీమలో ఎందుకు ఇసుక ఇవ్వలేకపోతున్నారు?

వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే.. భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వానికి వాళ్లతోనే సమాధి కట్టిస్తాం’ అని హెచ్చరించారు. ప్రధాని దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ‘ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు.. ప్రశ్నించిన కార్యకర్తలపై దాడులు, అట్రాసిటీ కేసులు.. నిజాలు రాసిన పత్రికలకు సంకెళ్లు.. ఇదేనా పాలన అంటే..!

ఇటువంటి నియంతృత్వ పోకడలకు బెదిరేవారు ఎవరూ లేరు. ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు చేసినా, కార్యకర్తలను జైళ్లో పెట్టినా ప్రజా పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. పోలీసులతో అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వానికి భయపడం. భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఎంతకైనా పోరాడతాం’ అని కన్నా స్పష్టం చేశారు.

కార్మికులను అవహేళన చేస్తారా: పురందేశ్వరి
గత ప్రభుత్వాల నిర్ణయాలను మార్చాలనుకుంటే కొత్త ప్రభుత్వాలు విధానాలను సిద్ధం చేసుకున్న తర్వాతే పాతవాటిని రద్దు చేయాలన్న జ్ఞానం వైసీపీ ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని పురందేశ్వరి అన్నారు. రెండు నెలల వరదలకు, ఐదు నెలల ఇసుక కొరతకు సంబంధమే లేదన్నారు.

‘ముఖ్యమంత్రి అవగాహనలేమి, అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పెట్టుబడులు రావడంలేదు.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.. రాష్ట్రానికి ఆర్థికంగా దెబ్బ.. ఇలాంటి దుస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. కార్మికులను అవహేళన చేసేలా వైపీసీ నేతలు మాట్లాడతారా’ అని ఆక్షేపించారు.
 
కార్మికుల ప్రాణాలు పోతుంటే పట్టదు కానీ మీడియాపై ఆంక్షలు పెట్టేందుకు సిగ్గుండాలని కామినేని శ్రీనివాస్‌ మండిపడ్డారు. జగన్‌ సొంత పత్రికలో ఒక్కటైనా వాస్తవం రాస్తున్నారా అని నిలదీశారు. ప్రజలు కష్టాలు పడుతుంటే పత్రికలు వార్తలు రాయకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
 
ఆర్థిక మోసాల తరహాలో టెండర్లు..: జయప్రకాశ్‌
ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే జగన్‌ జైలుకు వెళ్లక తప్పదని నేషనల్‌ లేబర్‌ బోర్డు ఛైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ హెచ్చరించారు.

ఆర్థిక మోసాల తరహాలో ఇసుక తరలింపు టెండర్లు వేసిన వైసీపీ నేతలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీది రాంగ్‌ ట్రాక్‌ అంటున్న విజయసాయిరెడ్డి.. గతంలో వైఎ్‌సను రాంగ్‌ ట్రాక్‌ పట్టించి జగన్‌ జైలుకు వెళ్లేలా చేశాడని విమర్శించారు.