బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:22 IST)

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం : సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

supreme court
గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని నిజ నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.
 
తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు మరొక పిటిషన్ వచ్చింది. జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించి హిందువుల మనోభావాలను అగౌరవపరిచారని సుర్జిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలవర పెడుతోందన్నారు. సాధారణ ప్రజల ప్రయోజనం కోసమే తాను ఈ పిటిషన్‌ను దాఖలు చేశానని చెప్పారు. సాధారణ పౌరులు అందరూ కోర్టు తలుపు తట్టలేకపోవచ్చని, సరిగ్గా సన్నద్ధం కాకపోవడం, ఆర్థిక పరిస్థితి అనువుగా లేకపోవడం ఇందుకు కారణాలు కావొచ్చని అన్నారు.