శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (21:10 IST)

బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు: అనిల్‌కుమార్ సింఘాల్

అమరావతి: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు  జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని, సొంతంగా 15 వేల వయల్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ఇచ్చే ఆక్సిజన్ కోటాను 625 మెట్రిక్ టన్నులకు పెంచిందన్నారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 1,01,330 కరోనా టెస్టులు చేయగా, 23,160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 106 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్లు 735, ఆక్సిజన్ బెడ్లు 1,075, సాధారణ బెడ్లు 9,378 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 17,886 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ప్రైవేటు ఆసుపత్రులకు19,949 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. ఏపీకి ఇచ్చే ఆక్సిజన్ కోటాను కేంద్ర ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. 590 నుంచి 625 మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

ఆర్ఐఎన్ఎల్ నుంచి నిన్నటి వరకూ 170 మెట్రిక్ టన్నులు కేటాయించారన్నారు. ఇకపై 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. ఆర్ఐఎన్ఎల్ నుంచి కోటా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం అంగూల్, రూర్కెల్లా ప్లాంట్ల నుంచి కేటాయింపులు పెంచిందన్నారు. మరికొన్ని ట్యాంకర్లు కేటాయించాలని కోరగా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ నెల 23వ తేదీలోగా 4 ట్యాంకర్లు ఇవ్వనున్నామని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని తెలిపారు. 
 
జామ్ నగర్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాక...
ఆర్ఐఎన్ఎల్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ తగ్గడంతో కేంద్రం... ఒడిశా, రూర్కెల్లా.. నుంచి కేటాయింపులు పెంచిందని ఆయన తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా 4 క్రయోజనిక్ ట్యాంకర్లను కేంద్రం కేటాయించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇస్తామని తెలిపిందన్నారు.

జామ్ నగర్ నుంచి మంగళవారం 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బుధవారం రాత్రికి గుంటూరు రానుందన్నారు. గడిచిన 24 గంటల్లో రూర్కెల్లా నుంచి 2 ట్యాంకర్లో 40 మెట్రిక్ టన్నులు, 4 ట్యాంకర్లో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కృష్ణపట్నం పోర్టుకు వచ్చిందని, ఆ ఆక్సిజన్ నుంచి నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు.

104 కాల్ సెంటర్ కు 12,365 ఫోన్ కాల్స్ రాగా, వివిధ సమాచారాల కోసం 4,929 కాల్స్ వచ్చాయన్నారు. అడ్మిషన్లకు 2,636, కరోనా టెస్టులకు 2,706, టెస్టు రిజల్ట్ కోసం 1,584 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. గత మూడు రోజుల నుంచి 104 కాల్ సెంటర్ వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య 400 కాల్స్ వరకూ తగ్గుముఖం పట్టిందన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లు బలోపేతం చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 4293 మంది వైద్యులు...12,679 మంది కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడారన్నారు. వారిలో 188 మందిని వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు, 200 కొవిడ్ కేర్ సెంటర్లకు వైద్యులు రికమండ్ చేశారన్నారు. 
 
బ్లాక్ ఫంగస్ నివారణకు సొంతంగా 15 వేల వయల్స్ కొనుగోలు...
బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం...ఏపీకి 1650 వయల్స్ కేటాయించిందని, వాటి కొనుగోలుకు మొన్ననే ఆడర్డర్ ఇచ్చామని, ఈ నెల 22,23 తేదీల్లో సప్లయ్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

ఒక్కో పేషంట్ కు 60 వయల్స్ అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారన్నారు. ఒక పేషంట్ కు రూ.3 లక్షల వరకూ వ్యయమవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ ఫంగస్ కు వైద్య సేవలను ఆరోగ్య శ్రీ కింద చేర్చామని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా  ఆలోచించి 3 కంపెనీల నుంచి 15 వేల వయల్స్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వాటికోసం ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. అవసరమైతే మరిన్ని వయల్స్ కొనుగోలుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఫంగస్ డేటా ఇంకా రావాల్సి ఉందని, అంకెలు దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద బ్లాక్ ఫంగస్ చేర్చడంతో పాటు కరోనా కారణంగా తల్లిదండ్రులు మృతిచెందడం వల్ల అనాథలైన పిల్లల సంరక్షణకు రూ.10 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవోలు జారీచేసిందన్నారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలైన పిల్లలను తక్షణమే గుర్తించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి, ఫీవర్ సర్వే, హోం ఐసోలేషన్ కిట్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. ఇపుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని, రాత్రిబంవళ్లు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.