1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:03 IST)

220 కళాశాలల గుర్తింపు రద్దు-పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లు

Education
ఏపీలో 220 ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్‌ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. 
 
ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 
 
మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని ఈశ్వరయ్య తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
 
గత ఏడాది రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. 
 
ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు.
 
సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.