ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:00 IST)

తూగో జిల్లాలో బాలికపై గ్రామ వలంటీరు అత్యాచారం

rape demo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్లు ఇపుడు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామ వలంటీరు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని సీతానగరం మండలం, బొబ్బిల్లంక అనే గ్రామంలో జరిగింది. 
 
అత్యాచారానికి పాల్పడిన వలంటీరును బూసి సతీష్‌ (21)గా గుర్తించారు. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న సతీష్... ప్రభుత్వ పథకాల చేరవేత పేరుతో తరచుగా ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇటీవల బాలిక ఒక్కరే ఇంట్లో ఉండగా, ఇదే అదునుగా భావించిన కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. 
 
అయితే, ఆ తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, ముభావంగా ఉండటంతో తల్లి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను రాజమండ్రి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.