కొత్త జిల్లాల బాదుడు పేరుతో కొత్త బాదుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెంచేసింది. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు వుంది. అంటే సగటున 20 శాతం మేరకు భారం మోపింది. ముఖ్యంగా, కొత్త జిల్లా కేంద్రాలు, వాటికి ఆనుకునివుండే శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెంపుదల భారీగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అయితే, ఈ పెరుగుదల పాత జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆగస్టు నుంచి పెంపుదల అమల్లోకి రానుంది. ఈ పెంపుదల కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉండనుంది. జిల్లా కేంద్రాలు, పక్కనున్న శివారు ప్రాంతాలు, ఆనుకునివున్న గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్లు ఎక్కడికక్కడ విలువలు ఎంత పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు తయారు చేశారు.
దానిపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, అక్కడ వాస్తవ మార్కెట్ విలువలు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచారు. దీంతో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఈ పెంపుదల ఉండనుంది.