ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (12:15 IST)

తెలంగాణలో టీడీపీ ఖాళీ.. రేవంత్ వెంట క్యూ కడుతున్న నేతలు

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. దీంతో రాజీనామాలపర్వం మొదలైంది.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. దీంతో రాజీనామాలపర్వం మొదలైంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పలువురు నేతలు ఇప్పటికే తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తాము రేవంత్‌ రెడ్డి వెంటే ఉంటామని ప్రకటించారు. పలు జిల్లాల్లో ముఖ్య నాయకులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్తుపై సమాలోచనలు చేశారు. 
 
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేం నరేందర్‌రెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదివారం పంపించారు. రాష్ట్రంలో సిద్ధాంతాలు, విధానాలకు అతీతంగా ఒక బలమైన వేదిక రూపుదిద్దుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని, అందువల్లే పార్టీని వీడుతున్నానని లేఖలో తెలిపారు. కాగా తాను టీడీపీకి సోమవారం రాజీనామా చేయనున్నట్లు మాజీ మంత్రి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బోడ జనార్దన్‌ ప్రకటించారు. 
 
అలాగే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సతీష్ మాదిగ, మేడిపల్లి సత్యం, అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి చారగొండ వెంకటేశ్‌ కూడా తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. తెలంగాణ సమాజహితం కోసం తాము రేవంత్‌ వెంటే ఉంటామని ప్రకటించారు. నల్లగొండ నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి కంచర్ల భూపాల్‌రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో ఆయనకు పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ షోకాజ్ నోటీసును పంపించారు. అయితే ఈ షోకాజ్‌కు తాను స్పందించబోనని, తాను చెప్పాలనుకున్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇప్పటికే చెప్పానని భూపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. 
 
మరోవైపు తనకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేటాయించిన క్వార్టర్‌ను కూడా రేవంత్‌ ఖాళీ చేశారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈ క్వార్టర్‌లో ఉంటున్నారు. రేవంత్‌ నిర్ణయంతో ఆయన క్వార్టర్‌ను ఖాళీ చేయనున్నారు. కాగా, రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తలపెట్టిన సమావేశానికి అనుమతి లేదని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. సమావేశానికి అనుమతి కోసం రేవంత్‌ రెడ్డి దరఖాస్తు చేసుకోలేదని, అందువల్ల అనుమతి ప్రస్తావనే లేదని చెప్పారు.