రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే కాంపిటేటివ్ పరీక్షలకు, స్కిల్ డవలప్ మెంట్ పై శిక్షణివ్వడం వంటి విన్నూత్న కార్యక్రమాలకు చేపట్టనుంది.
దీనిలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యూకేషన్ ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణివ్వనున్నామన్నారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చాలనే లక్ష్యంతో జిల్లాకో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సెప్టెంబర్ అయిదో తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలల పున: ప్రారంభిచాలని నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న భోజన పథకం) అందించే చర్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆయన నివాసంలో సమీక్షా సమావేశం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ. యూకేజీ విద్యా బోధన...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రి ప్రైమరీ ఎడ్యూకేషన్...ఎల్ కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ కేజీ, యూకేజీ బోధనలు సాగుతున్నాయన్నారు.
వాటిలో 11,657 అంగన్వాడీ కేంద్రాలు పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, భవనాలకు అనుకుని ఉన్నాయన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను ఆయా ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి విద్యా బోధన సాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యూకేషన్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ...
కార్పొరేట్ కళాశాలల దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణిచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు.
ఇందుకు సంబంధించిన కార్యచరణ ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో పలు మండలాల్లో నేటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలు లేని విషయం సీఎం గుర్తించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
విద్యా రంగంలో అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ఫేజ్-2, ఫేజ్-3లో జూనియర్, డిగ్రీ కళాశాలలు చేర్పించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు. విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
8వ తరగతి నుంచే ఉపాధి శిక్షణ...
ఎనిమిదో తరగతి నుంచే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లైఫ్ స్కిల్స్ కార్యక్రమాలపై ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు శిక్షణివ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. కంప్యూటర్ నిర్వహణ, హార్డవేర్ వంటి అంశాలపై ఈ శిక్షణా సాగాలన్నారని వెల్లడించారు.
కడపలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలో దివ్యాంగు విద్యార్థులకు విద్యా బోధన సాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సమీక్షా సమావేశంలో నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజేత స్కూల్ మోడల్ గా ప్రతి నియోజకవర్గంలోనూ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
మూడో విడత జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ పంపిణీకి పచ్చజెండా...
కరోనా నేపథ్యంలో ఇప్పటికే జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు నేరుగా ఇళ్ల వద్దకే డ్రై రేషన్ అందజేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు.
అంత వరకూ మూడో విడత డ్రైరేషన్ పంపిణీ కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ‘జగనన్న గోరుముద్ద... మన పిల్లలు-మన భవిష్యత్తు’ పేరుతో రుచికరమైన, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన మెనూ అందించాలని నిర్ణయించామన్నారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలల వంట గదుల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. సురక్షితమైన తాగునీటి పంపిణీతో పాటు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే ఆయా తరగతుల్లో సిలబస్ మార్పులు చేపట్టామని మంత్రి తెలిపారు. బ్రెయిలీ లిపి పుస్తకాల్లోనూ కొత్త సిలబస్ అందించనున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సర నుంచి 1 నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్ లు రూపొందించామన్నారు. ప్రతి సబ్జెక్టుకూ వర్క్ బుక్ అందివ్వనున్నామని మంత్రి తెలిపారు.
డైట్ సెంటర్లను టీచర్ ట్రయినింగ్ సెంటర్లగా మార్పు చేయనున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకో టీచర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆన్ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నామన్నారు.
ఇకపై ప్రతి ఏటా అకాడమిక్ ఆడిటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ పోస్టుల భర్తీ వ్యవహారం కోర్టులో ఉన్నందున న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.