సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స
రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇప్పటికే ఆధార్ సేవలతో సహా అన్ని పౌరసేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సచివాలయ సిబ్బంది వృత్తి నైపూణ్యాలను పెంచడం కోసం ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించిందని అన్నారు.
ప్రతిఏటా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ చేస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం స్థాయిలో పర్యవేక్షిస్తున్న స్పందన కార్యక్రమంను సచివాలయాల స్థాయిలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత మంచి పాలనను చేరువ చేస్తున్నామని అన్నారు.
బయోమెట్రిక్ విధానం, సచివాలయ సిబ్బందికి యూనిఫారంను అందించడం, అన్ని సచివాలయాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను అందుబాటులో ఉంచడం ద్వారా పనితీరును మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ప్రజలకు సేవలు అందింస్తున్నాయని తెలిపారు.
గత ఏడాది జనవరి 26 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.08 కోట్ల మంది సచివాలయాల్లో తమ విజ్ఞప్తులను అందచేశారని, 3.06 కోట్ల మంది సచివాలయ సేవలను పొందారని అన్నారు. రైస్ కార్డులు, ఇంటిపట్టాలు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక వంటి పథకాలను సచివాలయాల ద్వారానే పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు.
సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ చీఫ్ సెక్రటీ అజయ్ జైన్, ఎస్‌ఐఆర్డీ డైరెక్టర మురళి, పిఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.